Site icon NTV Telugu

Delhi Floods: డేంజర్‌లో యమునా నది.. మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు

Delhifloods

Delhifloods

దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్‌లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత నీటి మట్టం పెరిగితే కార్యక్రమాలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Off The Record : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ లలో కొత్త టెన్షన్!

ప్రస్తుతం నది ఒడ్డున ఉన్న నివాసాలన్నీ మునిగిపోయాయి. అలాగే వాణిజ్య ప్రాంతాలు కూడా నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మయూర్ విహార్ – ఫేజ్ 1 సమీపంలో ఏర్పాటు చేసిన కొన్ని సహాయ శిబిరాలు కూడా మునిగిపోయాయి. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరడం ఇది మూడోసారి. గతంలో 1978, 2023లో రెండు సార్లు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించింది. 2023లో నగరం తీవ్రమైన వరదలకు గురైనంది. అప్పట్లో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లకు చేరింది. ఇక 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. తాజాగా 2025లో అంతే స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఇది కూడా చదవండి: Jio Anniversary celebration: 9 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. యూజర్ల కోసం బంపరాఫర్లు.. ఫ్రీ అన్ లిమిటెడ్ 5G డేటా!

యమునా బజార్, గీతా కాలనీ, మజ్ను కా తిలా, కాశ్మీరీ గేట్, గర్హి మండు, మయూర్ విహార్ వంటి ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో వాణిజ్య, నివాస భవనాలు రెండూ కలిసి ఉంటాయి. ఇప్పటివరకు 14,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఐటీఓ, మయూర్ విహార్, గీతా కాలనీల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఇక వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితి ఉన్న నేపథ్యంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి వరద ప్రభావిత ప్రాంతాలు, యమునా నది సమీపంలోని సహాయ శిబిరాల్లో పురుగుమందులను పిచికారీ చేయాలని పౌర సంస్థ ప్రజారోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.

 

 

Exit mobile version