NTV Telugu Site icon

Delhi Election Results: ఆప్ చేసిన తప్పు ఇదేనా? అలా చేసుంటే గెలిచేదా?

Kejriwal

Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే ఆప్ ఓటమికి స్వయంకృత అపరాధమే కారణమని తెలుస్తోంది. ఇండియా కూటమిలో ఒక్కటిగా ఉన్న ఆప్, కాంగ్రెస్.. విడివిడిగా పోటీ చేయడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కొంత మంది ముఖ్యమైన నేతలు ఓడిపోయారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లతో ఈజీగా ఆప్ అభ్యర్థులు గట్టెక్కేవారు. కానీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు ఈజీగా గట్టెక్కేశారు. మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తిగా మారారు.

న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రీవాల్ స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసుంటే.. ఈజీగా కేజ్రీవాల్ గెలిచేవారు. కాంగ్రెస్ పోటీ చేయకుంటే.. ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్‌కు పడి సునాయసంగా గెలుపొందేవారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే.. దీక్షిత్‌కు పడ్డ ఓట్లన్నీ కేజ్రీవాల్‌కు పడి ఉంటే ఆప్ అధినేత గెలిచేవారు. విడిగా పోటీ చేయడం వల్ల ఘోరంగా దెబ్బతిన్నారు.

ఇండియా కూటమిలో ఉన్న ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసి ప్రత్యర్థుల మాదిరి ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ చేసినట్టుగానే.. కాంగ్రెస్ కూడా ఆప్‌పై ఆరోపణలు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. విడిగా పోటీ చేయడం వల్ల ఇద్దరూ ప్రయోజనం పొందకుండా పోయారు. గతంలో ఆప్ కూడా భారీ విజయాలు నమోదు చేయడంతో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఒంటరిగా బరిలోకి దిగడంతో అంచనాలు తల్లకిందులయ్యాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.