Site icon NTV Telugu

Arvind Kejriwal: “ఎమ్మెల్యేల కొనుగోలు” ఆరోపణలపై ఢిల్లీ సీఎంకి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు పోలీస్ కమిషనర్‌ని కలిసిన తర్వాత క్రైం బ్రాంచ్ ఈ చర్య తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని బిజెపి ప్రతినిధి బృందం కోరింది.

Read Also: Indian Navy: సముద్ర దొంగల బారి నుంచి పాక్, ఇరాన్ సిబ్బందిని కాపాడిన ఇండియన్ నేవీ..

గత వారం ఢిల్లీ మంత్రి అతిషి.. ఆప్‌కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు పార్టీ వీడేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లను బీజేజీ ఆఫర్ చేసిందని, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించిందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరిని సంప్రదించిన రికార్డింగ్ అందుబాటులో ఉందని, తర్వాత చూపిస్తామని ఆమె చెప్పారు. ఎన్నికల్లో గెలవలేకనే బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధమైందని ఆరోపించింది.

దీనిపై కేజ్రీవాల్ ఎక్స్‌లో స్పందించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, తనను త్వరలో అరెస్ట్ చేయవచ్చని, ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్ల చొప్పున ఇస్తామని, బీజేపీ తరుపున టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు, అయితే వారు పార్టీని వీడేందుకు నిరాకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ బీజేపీ ఈ ఆరోపణల్ని కొట్టేసింది. ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని డిమాండ్ చేసింది. మద్యం కుంభకోణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది.

Exit mobile version