ఈ మధ్య భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అనుమానాలు పెనుభూతాలవుతున్నాయి. దీంతో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురై సంసారాలు కుప్పకూలిపోతున్నాయి. ఈ మధ్య అన్ని కేసులు ఇలానే ఉంటున్నాయి. తాజాగా పరాయి పురుషుడితో రాత్రి పూట ఫోన్‌లో మాట్లాడినందుకు అనుమానిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ భర్త పిటిషన్ వేశాడు. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాత్రి పొద్దుపోయాక పరాయి పురుషుడితో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన మహిళ నడవడిక చెడిపోయిందని అర్థం కాదని ఢిల్లీ ధర్మాసనం పేర్కొంది. తన భార్య కాల్ రికార్డులు ఇవ్వాలని కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ఏఎస్‌జే శునాలి గుప్తా కొట్టేశారు.
ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి పూట ఫోన్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంత మాత్రాన ఒక మహిళ నడవడికను ప్రశ్నించలేమని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మహిళ గోప్యతను ఉల్లంఘించడానికి.. ఆమె కాల్ వివరాల రికార్డులను భద్రపరచాలని డిమాండ్ చేయడానికి ఏ మాత్రం యోగ్యం కాదని కోర్టు పేర్కొంది.
తన భార్య మరొక వ్యక్తితో అర్ధరాత్రి ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డులను భద్రపరచాలన్న అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడంతో.. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇక్కడ కూడా భార్య కాల్ రికార్డుల విషయంలో కోర్టు కఠినంగా వ్యవహరించింది. అప్పీల్‌ను అదనపు సెషన్స్ జడ్జి శునాలి గుప్తా కొట్టివేస్తూ.. ఈ కేసు ఒక గృహ హింస కేసుకు కింద వస్తుందని పేర్కొన్నారు.
జూన్ 2వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులో.. అర్ధరాత్రి అయినా సరే.. పరాయి పురుషుడితో ఫోన్‌లో మాట్లాడటం వలన ఒక మహిళ నడవడికపై ఎటువంటి సందేహాలు తలెత్తవని కోర్టు పేర్కొంది. సదరు వ్యక్తితో ఆ మహిళకు అక్రమ లేదా వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణ ఉంటే తప్ప.. కేవలం ఆ సంభాషణ ఆధారంగా అనుమానం వ్యక్తం చేయడం భావ్యం కాదని అభిప్రాయపడింది.
అయితే తన భార్య రాత్రి పొద్దుపోయాక క్రమం తప్పకుండా కొంతమంది వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడేదని.. టెలికాం కంపెనీ కాలక్రమేణా ఈ రికార్డులను తొలగించగలదని.. అందువల్ల వాటిని భద్రపరచాలని భర్త వాదించాడు. అయితే ఈ వాదనను న్యాయస్థానం ఏ మాత్రం అంగీకరించలేదు. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సమర్థిస్తూ.. సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గోప్యతా హక్కు పూర్తిగా అపరిమితమైనది కానప్పటికీ.. నిష్పక్షపాత విచారణ హక్కు కోసం తగిన సందర్భాలలో దానిని పరిమితం చేయవచ్చు. కానీ మరొక వ్యక్తి కాల్ రికార్డులను భద్రపరచాలనే ఏ డిమాండ్ అయినా బలమైన, సహేతుకమైన కారణాలపై ఆధారపడి ఉండాలి.’’ అని పేర్కొంది.
ఒక మహిళ ఒక పురుషుడితో సంభాషించడం నిషిద్ధంగా భావించేంతగా భారత సమాజం ఇప్పుడు వెనుకబడలేదని కోర్టు పేర్కొంది. నేటి మహిళలు ప్రతి రంగంలోనూ పనిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలలో గణనీయమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. వారికి పురుష సహోద్యోగులు ఉండటం సర్వసాధారణం. ఒక మహిళ రాత్రిపూట ఫోన్‌లో మాట్లాడుతున్నంత మాత్రాన.. ఆమె మొబైల్ కాల్ రికార్డులను భద్రపరచాలని కోరడం సరైందని కాదని కోర్టు పేర్కొంది. చెల్లుబాటు అయ్యే , పటిష్టమైన ఆధారం ఉంటేనే ఒకరి గోప్యతలోకి చొరబడటానికి అనుమతి ఉంటుంది. ఈ కారణాల ఆధారంగా, కోర్టు దిగువ కోర్టు ఉత్తర్వును సమర్థించి.. భర్త అప్పీల్‌ను కొట్టివేసింది.

