NTV Telugu Site icon

Kidney Sale Racket: “కిడ్నీ సేల్ రాకెట్‌”ని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు.. ఐదు రాష్ట్రాల్లో ముఠా వ్యాపారం..

Kidney Sale Racket

Kidney Sale Racket

Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో ఈ రాకెట్ పనిచేస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు బంగ్లాదేశీయులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు, సిమ్ కార్డులు, నగదు, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్‌కి చెందిన నిరుపేదల్ని ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని వ్యాపారం నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. వారి కిడ్నీలకు రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ముఠా విక్రయిస్తున్నట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో బాధితులకు ఉద్యోగాలను ఎరగా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అవయవాలు అందుకున్న వారికి సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారు. ఈ కిడ్నీలు అవయవాలు అవసరమున్న వ్యక్తులకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు విక్రయించినట్లుగా తేలింది.

Read Also: Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..

అరెస్టైన వారిలో నోయిడా ఆస్పత్రిలో 15 నుంచి 16 అక్రమ సర్జరీలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ విజయ కుమారి కూడా ఉన్నారు. ఢిల్లీలోని జలోలా విహార్‌లో బంగ్లాదేశ్‌కి చెందిన కొంతమంది అనుమానాస్పద కార్యక్రమాలపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రస్సెల్, రోకాన్, సుమోన్ మియాన్, రతేష్ పాల్ అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. డాక్టర్ విజయ కుమారి అనే వ్యక్తి ఒక్కో సర్జరీకి రూ. 2 లక్షలు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

మూత్రపిండాల మార్పిడి అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు చివరి దశలో అందించే వైద్య ప్రక్రియ. దగ్గరి బంధువుల నుంచి రోగికి కిడ్నీలు దానం చేయవచ్చు. సంబంధం లేని దాతల ద్వారా కిడ్నీ దానం చేయడానికి అధికార కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న దాతల సంఖ్య కంటే మార్పిడి అవసరమయ్యే రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో, చాలామంది కిడ్నీని పొందేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కిడ్నీ అనేది కొన్ని ముఠాలకు వ్యాపారంగా మారింది.