Delhi Car Blast: ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక విషయం తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న మహిళా డాక్టర్ షాహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఢీ కొట్టాడు. ఈ ఉగ్రదాడిలో 40 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ చీప్ మసూద్ అజర్ మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ మరణించాడు. ఈ ఉమర్ ఫరూక్ భార్యనే అఫిరా బీబీ.
Read Also: Divorce Case: “నా భార్యకు కుక్కలు అంటే ప్రేమ, దయచేసి విడాకులు ఇప్పించండి..”
జైషే మహ్మద్ ఇటీవల తన ఉగ్ర పన్నాగాలను మార్చుకుంది. కొత్తగా మహిళా జీహాదీలను తయారు చేసేందుకు సిద్ధమైంది. మహిళా ఉగ్రవాదుల కోసం ‘‘జమాల్ అల్ మోమినాత్’’ను ప్రారంభించింది. ఢిల్లీ పేలుడుకు కొన్ని వారాల ముందు అఫిరా ఈ జిహాదీ గ్రూప్ సలహా మండి షురాలో చేరారు. మసూద్ అజర్ చెల్లెలు సాదియా అజర్‌తో కలిసి అఫిరా పనిచేస్తోంది. వీరిద్దరు కూడా ఢిల్లీ పేలుడు కుట్రతో సంబంధం ఉన్న షాహీన్ సయీద్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న షాహీన్ సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్స్ మరియు ఇతర మందుగుండు సామగ్రి లభించడంతో ఆమెను అరెస్టు చేశారు. జమాత్-ఉల్-మోమినాత్ భారతదేశ విభాగానికి ఈమె చీఫ్‌గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. భారతదేశంలో ఉగ్రవాదం కోసం మహిళల్ని రాడికలైజ్ చేసే పనిని షహీద్ సయీద్‌కు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.