Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. “తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని” అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
Read Also: Congress Minister: ఢిల్లీ పేలుడుతో బీజేపీకి సంబంధం ఉందా.? కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
2006లో ఈ జంటకు పెళ్లయింది. తన భార్యకు వీధి కుక్కలను తమ ఇంట్లోకి తీసుకువచ్చే అలవాటు తనకు శారీరక, మానసిక బాధ కలిగించిందని ఆరోపించారు. కుక్కలు తన మంచంపై పడుకునేవని.. తాను, తన భార్య వద్దకు వెళ్లినప్పుడల్లా మొరుగుతున్నాయని, తనను ఒకసారి కుక్క కరిచిందని భర్త చెప్పారు. పదే పదే చెప్పినప్పటికీ కూడా తన భార్య, కుక్కల్ని ఇంటికి తీసుకురావడం మానేయలేదని అతను చెప్పాడు. తన భార్య జంతు సంక్షేమ సంఘంలో చేరిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని, జంతువుల్ని వేధించినందుకు పలువురిపై ఫిర్యాదు చేసేదని చెప్పారు. ఈ సమస్యల ఒత్తిడితో తనకు షుగర్, అంగస్తంభన సమస్యలు ఏర్పడ్డాయని, దీనికి తన భార్య ఎగతాళి చేసేదని అతను పేర్కొన్నారు.
తన భార్య పుట్టిన రోజున తనపై ఫ్రాంక్ చేసిందని, ఆమె పుట్టిన రోజున ఓ రేడియో జాకీ తనతో లైవ్ లోకి పిలిచి, జెన్నీ అనే మహిళగా నటిస్తూ, తనతో ఎఫైర్ ఉందని చెప్పుకుందని, ఆ తర్వాత తన భార్య అది ఎప్రిల్ ఫూల్ ప్రాంక్ అని చెప్పిందని భర్త వెల్లడించారు. అయితే, తన భర్త చేస్తున్న ఆరోపణల్ని భార్య ఖండించింది. విడాకులు పొందడానికి ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాదించింది. గతంలో ఫ్యామిలీ కోర్టు, తన ఉత్తర్వుల్లో ఈ సంఘటనలు భర్తపై క్రూరత్వం స్థాయికి చేరుకోలేదని తీర్పు చెప్పింది. దీంతో ఈ తీర్పుపై వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనల్ని విన్న కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.