భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ ఓ కుదుపు కుదిపేసింది.. కరోనాబారినపడినవారి సంఖ్య పెరగడమే కాదు.. కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, కోవిడ్ బారినపడినవారి ఒళ్లు గుల్లైపోతోంది.. కరోనా నుంచి కోలుకున్నతర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ పరిస్థితికి వైద్య పరిభాషలో లాంగ్ కోవిడ్ అనే పేరు పెట్టారు. ఈ పరిస్థితులపై మాట్లాడిన ఢిల్లీలోని ఎయిమ్స్ కోవిడ్ వైద్య నిపుణులు డాక్టర్ నీరజ్ నిశ్చల్.. లాంగ్ కోవిడ్ లక్షణాలు కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని కోవిడ్ బాధితులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా సుమారు ఐదారు నెలల పాటు వారిలో కోవిడ్-19 క్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే, సాధారణ కోవిడ్‌ను ఎదుర్కున్నవారిలో దీర్ఘకాలం పాటు ఇలాంటి లక్షణాలు లేకపోయినా.. తీవ్రమైన కోవిడ్ ఎదుర్కొన్నబాధితుల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు డాక్టర్ నీరజ్ నిశ్చల్.
దీనికి సంబంధించిన అధ్యయన నివేదికపై కూడా క్లారిటీ ఇచ్చారు డాక్టర్ నీరజ్ నిశ్చల్… భారత్‌లో, ఇతర దేశాల్లో దాదాపు 20 శాతం మంది బాధితులు సుదీర్ఘ కోవిడ్‌తో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.. కోవిడ్ నుండి కోలుకున్నా… వారు బాగా అలసటకు గురవుతున్నట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు.. ఒక అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్నవారిలో 11.8 శాతం బాధితులు తీవ్రమైన అలసటకు గురువుతున్నారని.. 10.9 శాతం మందిలో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనిపించాయని.. 6.4 శాతం మంది రుచి కోల్పోవడం.. 6.3 శాతం మంది వాసన కోల్పోవడం.. 6.2 శాతం మంది గొంతు నొప్పితో బాధపడడం.. 5.6 శాతం మందికి శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని అధ్యయనాల్లో బయటపడినట్టు చెబుతున్నారు. కాగా, కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ లాంటివి కూడా వెలుగు చూస్తున్నాయి.. మరికొందరిలో అక్కడక్కడ రక్తం గడ్డకట్టి.. బాధితులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు బయటపడిన సంగతి కూడా తెలిసిందే.