Sanjay Raut: డిసెంబర్ 19న దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దేశంలో ‘‘రాజకీయ భూకంపం’’ వస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలనే మరోసారి సంజయ్ రౌత్ చెప్పారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఒక పెద్ద రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇది మోడీ ప్రభుత్వ పతనానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు.
Read Also: SHANTI Bill: ఇక అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. “శాంతి బిల్లు”కు లోక్‌సభ ఆమోదం..
ఈ రాజకీయ గందరగోళం అమెరికా నుంచే ప్రారంభవముతుందని రౌత్ జోస్యం చెప్పారు. గతంలో పృథ్వీ రాజ్ చవాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. డిసెంబర్ 19న ఒక పెద్ద రాజకీయ మార్పు వస్తుందని అంచనా వేశారు. దేశానికి కొత్త ప్రధాని వస్తారని, ఆ వ్యక్తి మహారాష్ట్రకు చెందినవారని చవాన్ పేర్కొన్నారు. ఆ వ్యక్తి బీజేపీకి చెందినవారై ఉండవచ్చని ఆయన అన్నారు. మరోవైపు, రౌత్ మాట్లాడుతూ.. బీజేపీ తన నేతల్ని ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిందని అన్నారు. బీజేపీ నాయకులు ఢిల్లీ విడిచి వెళ్లవద్దని చెప్పారని, ఇది ఏదో ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తోందని అన్నారు.
