NTV Telugu Site icon

Mumbai Court: “బ్రేకప్” తర్వాత ప్రియుడి ఆత్మహత్య.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు..

Law News

Law News

Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్‌నర్లను మార్చడం “నైతికం”గా సరికాదు, కానీ రిలేషన్‌షిప్‌లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.

అదనపు సెషన్స్ జడ్జ్ ఎన్‌పీ మెహతా ఫిబ్రవరి 29న ఈ కేసును విచారించారు. నితిన్ కేసీ అనే వ్యక్తి ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న మనీషా చూడసమా, ఆమెకు కాబోయే భర్త రాజేష్ పన్వార్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. నితిన్ కేసీ జనవరి 15, 2016న తన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు, వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మనీషా ముందుగా నితిన్ కేనీతో రిలేషన్‌షిప్‌లో ఉండేది. కానీ ఆమె కేనీకి బ్రేకప్ చెప్పి రాజేష్ పన్వార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన నితిన్ కేనీ ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Read Also: UK: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి విద్వేష మత బోధకులు రాకుండా బ్యాన్.. యూకే కీలక నిర్ణయం..

మనీషా, రాజేష్‌లు కోనిని మానసికంగా హింసించి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ప్రాసిక్యూషన్ వాదించారు. మరోవైపు మనీషాను నితిన్ కేనీ వెంబడించాడని, ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని డిఫెన్స్ వాదించింది. అయితే, బాధితుడు నితిన్, మనీషా-రాహుల్ రిలేషన్‌లో ఉన్నారని తెలుసుకుని కలత చెందినట్లు కనిపిస్తోందని, ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలసుకుని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనే విపరీత చర్య తీసుకున్నట్లు భావిస్తున్నట్లు కోర్టు చెప్పింది.

నైతికంగా ఒకరి ఇష్టానుసారం ప్రేమ భాగస్వామిని మార్చడం సరికాదు, కానీ బాధితుడి ప్రేయసి/ప్రేమికుడు తన పార్ట్‌నర్‌ని మార్చుకుని వేరే వారితో రిలేషన్ కొనసాగిస్తే, శిక్షా చట్టంలోని నిబంధనలను చూస్తే, బాధితుడికి ఎటువంటి పరిహారం ఉండదని న్యాయమూర్తి చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం బాధితుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాలంటే, నిందితుడి వైపు నుంచి చురుకైన ప్రేరణ, ప్రోత్సాహం ఉండాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేమించే భాగస్వామి ఎలాంటి కారణం లేదకుండా బ్రేకప్ చెబితే, ఆ వ్యక్తి మానసికంగా దెబ్బతింటాడు, ప్రేమ సంబంధం విఫలం కావడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతని కేసులు IPC 306 ప్రకారం సెక్షన్ 107 కింద నమోదు చేయరు అని కోర్టు పేర్కొంది.