Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి. లోక్‌సభ మూడోదశ ఎన్నికల్లో రేపు గుజరాత్ లోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. నగరంలోని మొత్తం 7 పాఠశాలకు రష్యన్ IP అడ్రస్‌తో కూడిన సర్వర్‌ల నుండి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో సహా పోలీసు అధికారుల బృందాలు పాఠశాలల్లో సోదాలు నిర్వహించాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
Read Also: Vijayendra Prasad: రాజమౌళి తండ్రి ఎన్నికల ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చిన పాఠశాలల్లో అమృత విద్యాలయం, కేంద్రీయ విద్యాలయ ONGC (చంద్‌ఖేడా), ఆర్మీ స్కూల్ (షాహిబాగ్), ఆనంద్ నికేతన్ మరియు DPS (బోపాల్) ఉన్నాయి. ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని 28 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి.
గత వారం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని 151 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో విద్యార్థుల్ని వెంటనే స్కూళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. పోలీసులు ఇతర అధికారులు పాఠశాలల్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బూటకపు బాంబు బెదిరింపులుగా తేల్చారు. ఈ ఈమెయిళ్లు కూడా రష్యన్ డొమైన్ నుంచే వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఐపీ అడ్రస్‌ను మాస్క్ చేసి ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రగా అధికారలు అనుమానిస్తున్నారు. తరుచుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించే అరబిక్ పదం ‘సవారిమ్’తో ఈ ఈమెయిళ్లు ముడిపడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
