Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది.
గురువారం దక్షిణ తమిళనాడు మరియు డెల్టా జిల్లాలకు భారీ వర్షపాతం ఉంటుందని, శుక్రవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం డెల్టా, పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉత్తర తమిళనాడు జిల్లాలకు భారీ వర్షాలు వ్యాపించే అవకాశం ఉంది. చేపల వేలకు వెళ్లే వారిని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాలో ఇప్పటికే తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.