Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్‌కి రైతులు ‘‘అనుకూల వాతావరణాన్ని’’ సృష్టించారని, అయితే దానిని విజయంగా మార్చడంలో ఆ పార్టీ విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. ‘‘హుడా కాంగ్రెస్ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం..అతను ఎవరితో కాంప్రమైస్ కాలేకపోయాడు. పార్టీ అన్ని బాధ్యతలు అతడి పైనే ఉంచింది’’ అని అన్నారు.
Read Also: BJP: “సీఎం సిద్ధరామయ్యకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం”.. ఉగ్రవాది వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్..
సంయుక్త సంఘర్ష్ పార్టీ వ్యవస్థాపకుడుగా కూడా ఉన్న చారుణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి ఏకైక కారణం మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అని అన్నారు. ‘‘హర్యానాలో కాంగ్రెస్‌కి అనుకూల వాతావరణం ఏర్పడింది. అది రైతులు వలనే వచ్చింది. అయితే కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది’’ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలా ప్రవర్థించి రైతుల వైపు నిలబడటంలో విఫలమైందని అన్నారు. హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాధ్యతలను హుడాకు అప్పగించొద్దని కాంగ్రెస్‌కి రైతు నాయకుడు హెచ్చరికలు చేశాడు.
హర్యానా అసెంబ్లీలో భూపిందర్ సింగ్ హుడాకు ప్రతిపక్ష నేత బాధ్యతలను ఇవ్వవద్దని కాంగ్రెస్‌ని గుర్నామ్ సింగ్ చారుణి కోరారు. గత దశాబ్ధంలో హుడా ప్రతిపక్ష నేతగా సరిగా వ్యవహరించలేదని అన్నారు. రైతు సంఘాలే ప్రతిపక్ష పాత్ర పోషించాయని చెప్పారు. హర్యానా రైతు ఉద్యమానికి కేంద్రంగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, బీజేపీ ఓడిపోతుందని అనుకున్నప్పటికీ.. బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.