Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది. దీని వల్లే దేశంలో కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదలకు కారణం అని తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా సోకిన రోగుల నుండి సేకరించిన నమూనాలలో 98 శాతం XBB.1.16 వేరియంట్ కేసులే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ సబ్ వేరియంట్ XBB.1.16ని నిశితంగా గమనిస్తోంది. ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదం కాకున్నా.. కేసుల్లో పెరుగుదలకు కారణం అవుతోంది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తంగా ఉంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ రోజు కేంద్రం అత్యున్నత సమావేశాన్ని నిర్వహించబోతోంది.
Read Also: Rs.2000 Currency Note: రూ.2వేల నోటు కనిపించడం లేదు.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే
లక్షణాలు ఇవే..
ఈ వేరియంట్ కారణంగా జ్వరం వస్తుంది. ఇది 1-2 రోజుల వరకు కొనసాగుతుంది. గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది. XBB.1.16 వేరియంట్ ఎటువంటి తీవ్రమైన సమస్యలను కలిగించదు. అయినప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
జాగ్రత్తలు:
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన సర్కులర్ ప్రకారం.. కోవిడ్-19 ఉన్న రోగులు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. భౌతిక దూరం, మాస్క్ వాడాలి, ఎప్పటికప్పుడు రోగులు ఉష్ణోగ్రత, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.