Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అప్రమత్తం అయింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఐసీయూలు, ఆక్సిజన్ సదుపాయాలపై సూచనలు చేశారు. ఓ నెల క్రితం వరకు కేవలం వెయ్యి లోపలే ఉన్న రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో నమోదు అవుతోంది. నిన్న ఒక్క రోజే 6150 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కోవిడ్ ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరిస్తోంది. కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ యొక్క BF.7 సబ్-వేరియంట్, ప్రస్తుతం XBB1.16 సబ్-వేరియంట్ కారణంగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ సబ్ వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కాకున్న వేగంగా కేసులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
Read Also: PM Narendra Modi: “ప్రాజెక్ట్ టైగర్”కి 50 ఏళ్లు.. నేడు పులుల డేటా విడుదల చేయనున్న ప్రధాని
ఇదిలా ఉంటే కేసుల సంఖ్య పెరగడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి.
హర్యానా:
హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ అవలంభించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులను, పంచాయతీలను ఆదేశించింది.
కేరళ:
గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కేరళ మాస్క్‌లను తప్పనిసరి చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు.
పుదుచ్చేరి:
పుదుచ్చేరి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ గా తేలితే అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని కూడా కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తం అయింది. XBB.1.16 వేరియంట్ దేశరాజధానిలో కేసుల పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.