NTV Telugu Site icon

Danish Ali: “రాత్రంతా నిద్రపోలేదు”.. బీజేపీ ఎంపీ మతపరమైన వ్యాఖ్యలపై డానిష్ అలీ

Danish Ali

Danish Ali

Danish Ali: పార్లమెంట్ లో గురువారం చంద్రయాన్-3 చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రమేష్ బిధూరిని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియన్ అయ్యారు. మరోసారి ఇవి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రమేష్ బిధూరికి బీజేపీ పార్టీ నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే తనపై చేసిన వ్యాఖ్యలు ఎంపీ కున్వర్ డానిష్ అలీ తీవ్ర మనోవేధన చెందానని తెలిపారు. బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోకుంటే తాను బరువెక్కిన హృదయంతో పార్లమెంట్‌ని వీడి వెళ్లే ఆలోచనలో ఉన్నానని అన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు డానిష్ అలీ లేఖ రాశారు. తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలిచివేశాయని, రాత్రంతా నిద్ర పోలేదని అన్నారు. ఎన్నుకోబడిన ఎంపీలను వారి కమ్యూనిటీ ఆధారంగా దాడి చేయడానికి ఈ పార్లమెంట్ సమావేశాలు పెట్టారా..? అని ప్రశ్నించారు. ఇది దేశాని సిగ్గు చేటని, బిధూరిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందా..? లేదా..? అనేది చూడాలని జాతీయ మీడియాతో అన్నారు.

Read Also: Ramesh Bidhuri: ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీపై స్పీకర్ సీరియస్

ఎన్నికైన ఎంపీపై ఈ అసభ్య పదజాలం ఉపయోగించడం ఇదే తొలిసారి, ఇవి బెదిరింపు వ్యాఖ్యలని డానిష్ అలీ పేర్కొన్నారు. ఇది చలా దురదృష్టకరమని, స్పీకర్ గా మీ నేతృత్వంలో కొత్త పార్లమెంట్ లో మైనారిటీ ఎంపీపై ఇలాంటి ఘటన జరగడం బాధాకరంగా ఉందని ఆయన స్పీకర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రవర్తనా నియమావళి రూల్ 222, 226, 227 ప్రకారం పార్లమెంట్ సభ్యుడి హక్కులను ఉల్లంఘించినట్లు పేర్కొన్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని డానిష్ అలీ కోరారు. దానిపై విచారణ జరపాలని కోరారు.

రమేష్ బిధూరి వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణలు సరిపోవని, అతడిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బిధూరి చేసిన వ్యాఖ్యలు ప్రతీ భారతీయుడిని అవమానించడమే అని కాంగ్రెస్ నేత జై రాంరమేష్ అన్నారు. తీవ్ర విమర్శలు వస్తుండటంతో బీజేపీ రమేష్ బిధూరీకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.