NTV Telugu Site icon

Sam Pitroda: జర్నలిస్టుకి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ నేత.. హిందువుల గురించి ప్రశ్నించడంతో దాడి..

Sam Pitroda

Sam Pitroda

Sam Pitroda: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభం, ఓ జర్నలిస్టుని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా..? అని ప్రశ్నించారు.

ఈ ఘటన మొత్తం విమర్శలకు కారణం కావడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా, ఇండియా టుడే జర్నలిస్ట్ రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. దురదృష్టమైన సంఘటనగా, ఘటనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛ పట్ల తన నిబద్ధతను పిట్రోడా నొక్కిచెప్పారు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

Read Also: Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

బంగ్లాదేశ్ హిందువుల గురించి ప్రశ్నించడంతో దాడి..

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సమయంలో శామ్ పిట్రోడాని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ‘‘రాహుల్ గాంధీ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల అంశాన్ని అమెరికా చట్టసభ సభ్యులతో లేవనెత్తారా..?’’ అని ప్రశ్నించిన సమయంలో రోహిత్ శర్మపై దాడి జరిగింది. డల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. 30 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, ఇంటర్వ్యూ వీడియో మొత్తం డిలీట్ చేశారని రిపోర్టర్ తెలిపారు. తన అనుమతి లేకుండానే కాంగ్రెస్ కార్యకర్తలు తన ఫోన్‌ని అన్‌లాక్ చేశారని శర్మ చెప్పారు.

Show comments