NTV Telugu Site icon

Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది. తాజాగా ఎంవీఏ కూటమి ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిగా భావించి ఉండాల్సిందని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే అన్నారు.

Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?

‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో దాని వైఖరి మమ్మల్ని బాధించింది. ఉద్దవ్‌ ఠాక్రేని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. ఇలా చేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి’’ అని దాన్వే అన్నారు.

ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలలో సమయంలో కూడా శివసేన ఠాక్రే వర్గం, కాంగ్రెస్‌కి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సంజయ్ రౌత్, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలేని బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లోనే గెలుపొందింది. 89 సీట్లలో పోటీ చేసిన శివసేన ఠాక్రే వర్గం 20 స్థానాలను గెలుచుకుంది. 87 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ శరద్ పవార్ కేవలం 10 అసెంబ్లీల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఠాక్రే సేన తన బలాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతుందని దాన్వే చెప్పారు. ఏక్‌నాథ్ షిండే వల్ల శివసేన చీలిపోయిందని, బీజేపీకి చాలా రాష్ట్రాల్లో షిండేలు ఉన్నారని, వారిని బీజేపీ వాడుకుని పారేస్తుందని చెప్పారు.