Site icon NTV Telugu

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. సీనియర్ కాంగ్రెస్ నేత మరణం

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Congress’s Krishna Kumar Pandey dies during Rahul Gandhi-led Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మరణించారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెళ్లడించారు.

Read Also: Tamilisai Soundararajan: గవర్నర్ దగ్గర పెండింగ్‌లో పలు బిల్లులు.. తమిళిసై ఆగ్రహం

పాండే తన చివరి క్షణాల్లో, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వెల్లడించారు. అంబులెన్సులో అతడిని తరలించే సమయానికే అతను చనిపోయినట్లు జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణకుమార్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది అని.. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేవాడని ఆయన అన్నారు. పాండే మరణంపై రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ పాండే మరణం మొత్తం కాంగ్రెస్ కుటంబానికి బాధాకరమని.. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అతను తన చివరి క్షణంలో కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడని.. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘‘ భారత్ జోడో యాత్ర’’ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. నాందేడ్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించిన రాహుల్ గాంధీ మంగళవారం యాత్రను పున: ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకులు బాలా సాహెబ్ థోరట్, మణిక్ రావు ఠాక్రే, నసీమ్ ఖాన్ పాల్గొన్నారు. దాదాపుగా 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ తో భారత్ జోడో యాత్ర ముగియనుంది.

Exit mobile version