Tamilisai Writes Letter To Govt On Universities Common Recruitment Bill: పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్సిటీలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన బిల్లులోని కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలని మంత్రికి, అధికారులకు గవర్నర్ లేఖ రాశారు. అలాగే ఈ విషయంపై యూజీపీ నిర్ణయాన్ని కూడా ఆమె కోరారు. నియామకాలపై విధి విధానాలు.. లోకల్, నాన్-లోకల్.. నాన్-టీచింగ్ స్టాఫ్ భర్తీ.. తదితర అంశాల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే.. పరిస్థితి ఏంటి? అని గవర్నర్ ప్రశ్నించారు. ప్రస్తుతమున్న విధానంలోనే రిక్రూట్ చేస్తే.. అభ్యంతరం ఏమిటని నిలదీశారు. విధివిధానాలు రూపొందించి, ప్రాసెస్ ప్రారంభించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ పరిస్థితి ఏంటని అడిగారు. రిక్రూట్‌మెంట్ బోర్డులో ప్రభుత్వ అధికారులు ఉండడం.. దాని చట్టబద్ధతపై యూజీసీ తన అభిప్రాయం తెలపాలని గవర్నర్ కోరారు.
అలాగే.. వైద్య విద్యలో ఫ్యాకల్టీ వయో పరిమితి పెంపు బిల్లుపై కూడా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫాకల్టీకి 65 ఏళ్లు పెంచడం ఓకే కానీ.. అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో ఉన్న వారికి వయో పరిమితి ఎలా పెంచుతారని ప్రశ్నించారు. డీఎమ్ఈ, అడిషనల్ డీఎమ్ఈ పోస్టుల వయోపరిమితి 65 ఏళ్లకు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అడిగారు. అనంతరం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులో భాగంగా కావేరి వర్శిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ సంస్థకు విద్యారంగంలో ఎలాంటి అనుభవం లేదని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. మోటర్ వెహికిల్ చట్ట సవరణ బిల్లుపై కూడా గవర్నర్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు తన పరిధిలో లేదని.. రాష్ట్రపతి ఆమోదం కావాలని గవర్నర్ తమిళిసై అడిగారు.