NTV Telugu Site icon

Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Congress vs Left: కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్‌గా మారింది రాజకీయం. నిజానికి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ విమర్శలకు ప్రతిగా వామపక్ష మద్దతు ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్, రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్‌ని కేంద్ర సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై అన్వర్ మాట్లాడుతూ.. అతను ‘‘తక్కువ స్థాయి పౌరుడు’’ అని ఆరోపించడమే కాకుండా, రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది.

మంగళవారం పాలక్కాడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నిలంబూర్ ఎమ్మెల్యే అన్వర్ మాట్లాడుతూ..‘‘నేను రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ పరిధిలో భాగం, ఆయన్ను గాంధీ ఇంటిపేరుతో పిలువలేను. అతను తక్కువస్థాయికి పౌరుడిగా మారిపోయాడు. గాంధీ ఇంటిపేరులో పిలవడానికి అర్హత లేని వ్యక్తి. భారతదేశ ప్రజలు కూడా గత రెండు రోజులుగా ఇదే చెబుతున్నారు’’ అని అన్నారు.

Read Also: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!

సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంపై అన్వర్ మండిపడ్డారు. ‘‘నెహ్రూ కుటుంబంలో ఇలాంటి సభ్యులు ఉంటారా..? దానిపై నాకు అనుమానాలు ఉణ్నాయి. రాహుల్ గాంధీ డీఎన్ఏ పరీక్షించాలని నా అభిప్రాయం. రాహుల్‌కి జవహర్ లాల్ నెహ్రూ మనవడిగా ఎదగడానికి హక్కు లేదు. ఆయన ప్రధాని మోడీకి ఏజెంటా..? అని మనం ఆలోచించాల్సి ఉంది’’ అని అన్వర్ వ్యాఖ్యలు చేశారు.

అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఎంఎం హసన్ తెలిపారు. నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని నీచమైన పదజాలంతో దూషించిన అన్వర్‌పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని హసన్ డిమాండ్ చేశారు. గాడ్సే కొత్త అవతారం పీవీ అన్వర్ అని.. గాంధీజీని చంపిన గాడ్సే తూటాల కంటే అన్వర్ మాటలు ప్రమాదకరమని, ఒక ప్రజాప్రతినిధి నుంచి రాకూడదని విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని హసన్ అన్నారు. పీవీ అన్వర్ సీఎం ఆత్మాహుతి దళంలో పనిచేస్తున్నాడని మండిపడ్డారు.