Site icon NTV Telugu

Congress Satyagraha Deeksha: నేడు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Congress

Congress

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఇవాళ గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. దీక్ష వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌ వెల్లడించారు. అగ్నిపథ్‌ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.

సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానం తీసుకొచ్చి యువతను నిర్వీర్యం చేస్తున్న అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐసీసీ డిమాండ్‌ చేసిందని అయన తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహదీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. అగ్నిపథ్‌ రద్దయ్యేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మహేష్​కుమార్ గౌడ్ తెలిపారు.

ఢిల్లీలో..: మరోవైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ ఎంపీలు సత్యాగ్రహం చేయన్నారు. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. పార్టీ ఎంపీలతోపాటు వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీసు బేరర్లు పాల్గొననున్నారు. అగ్నిపథ్‌ పూర్తిగా దిశ లేని పథకం అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఓ ప్రకటనలో విమర్శించారు. పోరాటాన్ని యువత శాంతియుతంగా కొనసాగించాలని, కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వ్యవసాయ చట్టాల్లానే ప్రధాని మోదీ అగ్నిపథ్‌ను కూడా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మోదీని ‘మాఫీవీర్‌’గా రాహుల్ అభివర్ణించారు. ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ విలువలను బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని ఆక్షేపించారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్మీ అభ్యర్థుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కోరారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. సైనికుల పోరాట సామర్థ్యాన్ని ఆ పథకం నిర్వీర్యం చేస్తుందని, యువతకు ఉపాధి లేకుండా, భవిష్యత్తుపై భద్రత లేకుండా చేస్తుందని ఆక్షేపించారు.

Exit mobile version