Congress Party President Election: కాంగ్రెస్ పార్టీ త్వరలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ అధ్యక్షతన ఆగస్టు 28న మధ్యహ్నం 3.30 గంటలకు వర్చువల్ గా సమావేశం జరగనుంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మెజారిటీ నేతలు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే 1998 తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకరిపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదవీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయాన్ని సోనియా గాంధీ, అశోక్ గెహ్లాట్ కు తెలియజేశారని సమాచారం. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ అధ్యక్షపదవీ బాధ్యతలను సమర్థంగా చేపట్టలేకపోతున్నారు. అశోక్ గెహ్లాట్ కు జాతీయ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించి.. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను సీఎం అభ్యర్థిగా తీసుకురావాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిని కూడా తొలగించవచ్చని భావిస్తోంది.
మరోవైపు అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకుంటే కార్యకర్తలు, నాయకులు నిరాశకు గురవుతారని అన్నారు. మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోకుంటే ఎవరూ బలవంతం చేయరని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే చివరి సారిగా 1996-1998 మధ్య సీతారం కేసరి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే ఉన్నారు. మధ్యలో 2017-2019 మధ్య కాలంలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ దారుణ పరాజయం తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
