Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది. స్టీరింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి), జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృత స్థాయి భేటీ జరగబోతోంది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలు సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే సమావేశానికి రాలేకపోతున్న నేతలు “ఆన్ లైన్” లో నైనా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశం.
Read Also: Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మోదీ ఇంటిపేరుపై 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను గురువారం విధించింది. రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే కోర్టు 30 రోజలు బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు ఈ తీర్పుపై స్టే ఇస్తేనే అనర్హత వేటు పడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ శిక్షకు సంబంధించే ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.