Congress MLA Rs 300 Crore Demand: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె, ఇప్పుడు తన సొంత పార్టీ ఎదుటే భారీ షరతులు పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించి, బీనాను జిల్లాగా ప్రకటిస్తేనే కాంగ్రెస్‌లో కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కలకలం రేపుతోంది.
ఉమాంగ్ సింఘర్‌కు నేరుగా సవాల్
నిర్మలా సప్రే ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్‌కు బహిరంగంగా సవాల్ విసిరారు. “బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా బీనాను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరితేనే నేను కాంగ్రెస్‌తో కొనసాగుతాను” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిని “బహిరంగ రాజకీయ బేరసారాలు”గా అభివర్ణించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కానీ బీజేపీకి దగ్గరగా?
నిర్మలా సప్రే కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, ఎన్నికల అనంతరం నుంచి ఆమె బీజేపీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలతో వేదికలు పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆమె త్వరలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు కూడా బలపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హైకోర్టులో ఫిరాయింపు కేసు
మరోవైపు, నిర్మలా సప్రేపై కాంగ్రెస్ ఇప్పటికే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు కోరుతూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం, పార్టీ టికెట్‌పై గెలిచిన తర్వాత నిర్మలా సప్రే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ సైలెంట్..
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీసీ శర్మ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన స్పందిస్తూ, “నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడి, బేరసారాల్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది” అని ఆరోపించారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అయితే నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇక, బీనాను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. స్థానికంగా ఇది కీలక రాజకీయ అంశంగా మారింది. ప్రజల అభివృద్ధి, ప్రాంతీయ అవసరాల కోసం తాను ఈ డిమాండ్లు చేస్తున్నానని నిర్మలా సప్రే పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమా? లేక రాజకీయ ఒత్తిడి భాగమా? అన్న చర్చ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
