NTV Telugu Site icon

Congress: “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో నేడు కాంగ్రెస్ భారీ ర్యాలీ

Rahul Gandhi

Rahul Gandhi

Congress-Mehangai Par Halla Bol rally: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. నిత్యవసరాల ధరల పెరుగుదలపై “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి “రాంలీలా మైదాన్” కు చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు రాంలీలా మైదాన్ లోని సభాస్థలికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు, పీసీసీ సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. దీంతో పాటు ఆగస్టు 17 నుంచి 23 వరకు వరుసగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ “మెహంగాయ్ చౌపాల్” నిరసన ప్రదర్శనలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి ముగింపుగా నేడు ఢిల్లీలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్.

Read Also: Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!

దేశంలో నిత్యవాసరాల ధరలు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ, నిరసనలు చేపడుతోంది. ఢిల్లీలో జరుగుతున్న భారీ ర్యాలీకి హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నారు. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా పెరుగుతన్న ధరలపై ప్రజాపోరాటాలు చేస్తామని.. కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలే సామాన్య ప్రజల కష్టాలకు కారణం అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించింది. సామాన్యుడు పడుతున్న బాధల పట్ల ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని బీజేపీని విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7 నుంచి కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో’’ యాత్రను చేపడుతున్నారు. 3500 కిలోమీటర్ల పొడవున దేశం మొత్తం యాత్ర జరగనుంది. పెరిగిన ధరలు, నిరుద్యోగం, మత సామరస్యం లాంటి పలు సమస్యల గురించి ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు రాహుల్‌ గాంధీ.