NTV Telugu Site icon

Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత హత్య.. తామే చంపామన్న ఖలిస్తానీ ఉగ్రవాది..

Punjab

Punjab

Punjab: ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో సోమవారం స్థానికి కాంగ్రెస్ నాయకుడిని తన నివాసంలో కాల్చి చంపారు. బల్జీందర్ సింగ్ బల్లి అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం దాలా గ్రామంలోని బల్లి నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇతను అజిత్వాల్ లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

Read Also: Canada: భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు భారత దౌత్యవేత్త బహిష్కరణ

అయితే ఈ హత్యకు కెనడాకు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది అర్ష్ డల్లా బాధ్యత తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టాడు. బల్జిందర్ సింగ్ బల్లి తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించారు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇది ప్రతీకారం తీర్చుకునేలా ప్రేరేపించిందని ఆయన పేర్కొన్నారు. అర్ష్ డల్లా టెర్రరిస్టుగా భారత్ చేత గుర్తించబడ్డాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతని కోసం వెతుకుతోంది. గత మూడు నాలుగేళ్లుగా అతను కెనడా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. పంజాబ్ లో జరిగిన పలు హత్యలకు ఇతనితో సంబంధాలు ఉన్నాయి.

హత్య జరిగే సమయంలో బల్జిందర్ సింగ్ తన ఇంట్లో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు, ఏవో పత్రాలపై సంతకాలు చేయాలని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అభ్యర్థన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బల్లిపై కాల్పులు జరిపి హతమార్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.