NTV Telugu Site icon

Congress: “కొందరు కాంగ్రెస్ నేతలు రాముడిని, హిందువులను ద్వేషిస్తారు”.. సొంత పార్టీపై సీనియర్ నేత విమర్శలు..

Congress

Congress

Congress: సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం, సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు రాముడి, హిందువులను ద్వేషిస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ద్వేషించే వ్యక్తి హిందువు కాలేడని, రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం అంటే నిజం చెప్పలేనని అర్థం కాదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హిందువుల మద్దతు కోరుకోకపోవచ్చని, వారు హిందూ మతగురువులను అవమానించాలని అనుకుంటున్నారని, అందుకే తనను స్టార్ క్యాంపెనర్‌గా గుర్తించడం లేదని ఆయన అన్నారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. కూటమి అనేదేమీ లేదని నేను భావిస్తున్నని అన్నారు. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం ప్రధాని మోడీని ఓడించి, బీజేపీని గద్దె దించడమేనని, అయితే విపక్షాలు మోడీని ఎంత ద్వేషిస్తున్నారో.. వారు భారతదేశాన్ని కూడా అంతే ద్వేషించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్‌ని ప్రారంభిస్తే, దాన్ని వ్యతిరేకిస్తారు, వందేభారత్ అని రైలుకు పేరు పెడితే దాన్ని వ్యతిరేకిస్తారు, ప్రతిపక్షం గందరగోళంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: IIT Bombay: “పాలస్తీనా ఉగ్రవాదిని పొగిడిన ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్”.. ఐఐటీ బాంబే విద్యార్థుల ఫిర్యాదు..

మహిళలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఇండియా కూటమి నేతలు విమర్శించడం లేదని, ప్రతీ దానికి మోడీనే నిందిస్తున్నాంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు తప్పులన్నింటిని మోడీపై మోపాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ…భారత్, సనాతనం గురించి మాట్లాడితే బీజేపీలో చేరాలనుకున్నట్లు అర్థం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కూడా చెప్పారు. మోడీకి పోటీ ఇవ్వాలనుకుంటే ప్రియాంకాగాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని అన్నారు.

ఆచార్య ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వసర్మ స్పందించారు. ‘‘ కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు ఆచార్య ప్రమోద్ జీ చెప్పేదాన్ని నేను ధృవీకరిస్తున్నాను. నిర్దిష్ట ఓటు బ్యాంకుకు భయపడి, శ్రీరాముడు అంటే కాంగ్రెస్ పార్టీకి అలెర్జీ’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కృష్ణం వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని, దానికి రాహుల్ గాంధీనే అతిపెద్ద ఉదాహరణ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ అన్నారు.