Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తైంది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. దీని తర్వాత నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.
మహరాష్ట్ర పీసీసీ ఇంచార్జ్ హెచ్ కే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ , కాంగ్రెస్ నేతలు బాలా సాహెబ్ థోరట్, ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్తాప్ వంటి నాయకులు ఈ ఇద్దరు నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతో శ్రీలో మంగళవారం కలిసింది. శరద్ పవార్ ని యశ్వంత్ రావు చవాన్ ప్రతిష్టాన్ లో కలిసింది కాంగ్రెస్ బృందం. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఇరు నేతలను ఆహ్వానించింది.
Read Also: Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత్ దూరం.. తేల్చి చెప్పిన జై షా
గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాటు ఈ ప్రభుత్వ కొనసాగింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వైపే ఉండటంతో ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ గత వైభవం కోసం భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా కొనసాగి జమ్మూకాశ్మీర్లో ముగియనుంది. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది.