NTV Telugu Site icon

PM Modi: విదేశాల్లో భారత పరువు తీస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పీఎం మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు. ‘‘నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్పూర్తి చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్‌లో ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, వారి దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానించడం గురించి మాట్లాడటం చూడండి – ఇది ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’, ‘‘అర్బన్ నక్సల్స్’’ కి చెందినవారు నడుపుతున్న కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేషుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్‌లో ఎలా ఉంచిందో చూశాం.’’ అని మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.

Read Also: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి

కాంగ్రెస్ అంటే అబద్ధాలు, మోసం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అక్కడ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బలహీన వర్గాలను ఎదగనీయడం లేదని, కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆలోచనని తొలగించిందని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు విశ్వకర్మ సోదరులను ఆదుకుని ఉంటే ఈ సమాజానికి ఎంతో సేవ చేసి ఉండేవారని అన్నారు.

మహారాష్ట్రలో గత ‘‘ మహావికాస్ అఘాడీ’’ పాలనని విమర్శించారు. పత్తి రైతుల్ని ఠాక్రే ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. మహారాష్ట్ర రైతులకు పత్తి పంటను బలంగా మార్చకుండా అప్పటి ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టి, రైతుల పేరుతో రాజకీయాలు చేసి, అవినీతికి పాల్పడిందని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ 2014లో ఏర్పడిందని, ఆ సమయంలో అమరావతిలో టెక్స్‌టైల్స్ పార్కు పనులు ప్రారంభమైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

Show comments