నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ సింగర్ సహజ్ అంబావత్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌కు మొదటి ఫోన్ యజమాని అయ్యాడు. ఆయన ఐఫోన్ 16 ప్రో 256జీబీ డెసర్ట్ టైటానియం వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 1.3 లక్షలు. కానీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కారణంగా.. రూ. 1.25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సింగర్‌గా సహజ్.. ఐఫోన్ 16 ప్రో యొక్క ఆడియో మిక్స్ ఫీచర్‌ని ఎక్కువగా ఇష్టపడ్డాడు.
ఐఫోన్ 16 కొనడానికి ఉదయం 4:30 నుంచి క్యూలో..
ఈ కొత్త ఫోన్ గురించి సహజ్ మాట్లాడుతూ.. ఈ ఫీచర్ తన పాటల వీడియో నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నాడు. “నేను ఐఫోన్ 16 ప్రో 256జీబీ డెసర్ట్ టైటానియం కొనుగోలు చేశాను. ఇందులోని ఆడియో మిక్స్ ఫీచర్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా రికార్డింగ్ సమయంలో నాకు బాగా ఉపయోగపడుతుంది. నగరంలో ఇదే తొలి ఫోన్. ఆపిల్ స్టోర్‌లో ఇది నా మొదటి అనుభవం. నేను ఐఫోన్ 16 కొనడానికి ఉదయం 4:30 నుంచి ఇక్కడ ఉన్నాను.” అని తెలిపాడు.
సెప్టెంబర్ 10న ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల..
ఇదిలా ఉండగా.. టెక్ దిగ్గజం యాపిల్ సెప్టెంబర్ 10న ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో వస్తున్నాయి. న్యూరల్ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్ గత సిరీస్‌ల కంటే రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని యాపిల్ ఈసీవో టిమ్ కుక్ తెలిపారు. 17 శాతం ఎక్కువ బ్యాండ్ విడ్త్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను ఇది కలిగి ఉంటుంది.
iPhone 16 Series Features:
యాపిల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఐఫోన్‌లోని యాప్‌లను సులువుగా ఉపయోగించుకోచ్చు. అక్టోబర్‌లో బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్‌ను కంపెనీ విడుదల చేస్తోంది. అనంతరం చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఇది విడుదల కానుంది. అయితే భారతీయ భాషలకు సంబంధించి యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక 16 సిరీస్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని యాపిల్ చెప్పినప్పటికీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెప్టెంబర్ 13 నుంచి ప్రీబుకింగ్‌లు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
iPhone 16 and iPhone 16 Plus Specs:
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. గ్లాస్ బ్యాక్ ఫోన్లతో పోలిస్తే.. ఇది రెండు రెట్లు అధిక మన్నికగా ఉంటుంది. ఐఫోన్ 16 డిస్‌ప్లే 6.1 అంగుళాలు కాగా.. వెనిలా వేరియంట్‌తో రూపొందించారు. ఐఓఎస్ 18తో పనిచేస్తుంది. 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ డిస్‌ప్లే 6.7 అంగుళాలు. ఇందులో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. వెనకవైపు 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ కెమెరా ఉంది. కెమెరా కంట్రోల్ బటన్‌తో సులభంగా ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్ ఉంది. ఫోన్ 16లో ఏఏఏ గేమ్స్ ఆడుకోవడానికి అవకాశం కల్పించారు.
iPhone 16 Pro and iPhone 16 Pro Max Camera:
ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే 6.3 అంగుళాలు కాగా.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్‌ప్లే 6.9 అంగుళాలు. రెండు మోడళ్లలో అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఛాంబర్ ఫీచర్ ఉంది. డివైజ్‌లు హీట్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలో ఏ18 ప్రో చిప్ ఉంటుంది. వెనకవైపు రెండు 48 ఎంపీ కెమెరాలను ఇచ్చారు. ఇందులో ఒకటి 48 ఎంపీ ఫ్యూజన్ కెమెరా కాగా.. మరొకటి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. 12 ఎంపీ 5ఎక్స్ టెలిఫొటోతో ఫొటోలు తీయవచ్చు. ప్రో మోడళ్లలో 4k 120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయవచ్చు.