Site icon NTV Telugu

Modi vs Congress: ట్రంప్‌ను కలవలేకే సదస్సుకు మోడీ దూరం.. కాంగ్రెస్ విమర్శ

Modi Vs Congress

Modi Vs Congress

మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

‘‘చాలా రోజులుగా ఈ సదస్సు గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మోడీ దీనికోసం కౌలాలంపూర్‌ వెళ్తారా? లేదా? అని. ఇప్పుడు వెళ్లడం లేదని తేలిపోయింది. అంటే ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకొని ఫొటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకొనే అవకాశం కోల్పోయారు. మోడీ ఈ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా అక్కడ ఉండటమే. కొన్ని వారాల క్రితం ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మన ప్రధాని హాజరుకాలేదు. ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన కారణంగా.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కానీ.. ట్రంప్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను తానే ఆపానని 53 సార్లు.. రష్యా చమురును భారత్‌ కొనుగోలు నిలిపివేసిందని ఐదుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో కలవకుండా మోడీ జాగ్రత్త పడుతున్నారు’ అని జైరాం రమేష్ విమర్శించారు.

ఇది కూడా చదవండి: Rajasthan: పెట్రోల్ పంప్ కార్మికుడిని చెంపదెబ్బ కొట్టిన మేజిస్ట్రేట్.. అసలేం జరిగిందంటే..!

ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఆసియన్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోడీ వెళ్లడం లేదని.. షెడ్యూల్ సమస్యల కారణంగా మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు మీడియాకు తెలియజేశారు. ప్రధాని మోడీ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా వెళ్తారని.. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం తరపున జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారని ఈ మేరలకు మలేషియాకు భారత్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Gold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 26 నుంచి 28 వరకు కౌలాలంపూర్‌లో జరగనున్నాయి. శిఖరాగ్ర సమావేశాల్లో జరిగే చర్చల్లో భారత్ ఎంత వరకు పాల్గొంటుందనే దానిపై క్లారిటీ లేకపోయినా.. వర్చువల్‌ మోడ్‌లో మాత్రం ప్రధాని మోడీ పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి.

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం అనేది ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించిన ఆసియాన్ (ASEAN) సభ్య దేశాల నాయకులు నిర్వహించే ద్వివార్షిక సమావేశం. ఈ సమావేశాలు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ నాయకులంతా ఒకచోట చేరతారు. ప్రస్తుతం ఈ సమావేశానికి మలేషియా అధ్యక్ష స్థానం వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే ట్రంప్.. మలేషియాకు సమాచారం అందించారు.

తాజాగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్ కాల్‌లో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు.. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో హృదయపూర్వక సంభాషణ జరిగింది. మలేషియా ASEAN అధ్యక్షత వహించినందుకు ఆయనకు అభినందనలు… ASEAN-భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనడానికి.. ASEAN-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నాను.’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

గతంలో ప్రధాని మోడీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో క్రమం తప్పకుండా పాల్గొంటూనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం స్వయంగా హాజరయ్యారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్లలో మాత్రం వర్చువల్‌గా పాల్గొన్నారు. 2022లో కూడా హాజరుకాలేదు. ఇప్పుడు ఈ ఏడాది కూడా హాజరు కావడం లేదు.

 

Exit mobile version