NTV Telugu Site icon

Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

Congress Chief Mallikarjun Kharge

Congress Chief Mallikarjun Kharge

Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ‘‘మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ని అర్బన్ నక్సలైట్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అయితే, ఆయన సొంత పార్టీ సంగతేంటి..? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు.’’ అని ఖర్గే అన్నారు.

Read Also: Crime: కూతురి లవ్ ఎఫైర్.. హత్య కోసం వ్యక్తికి సుపారీ ఇచ్చిన తల్లి.. ట్విస్ట్ ఏంటంటే తల్లినే చంపేశాడు..

అక్టోబర్ 05న కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ సమూహం నియంత్రిస్తోందని, ఆపార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలు కలిసి రావాలని ప్రధాని మోడీ కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు వాషిమ్‌లో జరిగిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. “మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుంది. భారతదేశం పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉందో అందరూ చూస్తున్నారు. దళితులను దళితులుగా, పేదలను పేదలుగా ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాబట్టి, కాంగ్రెస్‌తో జాగ్రత్త. కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారు. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది, అందుకే మనల్ని విభజించాలని చూస్తోంది. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండండి. కలిసి ఉండాల్సిన సమయం ఇదే’’ అని ప్రధాని అన్నారు.

అక్టోబర్ 09న హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచిన తర్వాత మళ్లీ అర్బన్ నక్సల్స్ అని ప్రధాని ప్రస్తావించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశం మూడ్‌ని తెలియజేస్తుందని, కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు నిరూపించారని ప్రధాని అన్నారు.

Show comments