NTV Telugu Site icon

India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్‌పై భారత్ కీలక వ్యాఖ్యలు..

India On Bangladesh

India On Bangladesh

India On Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్‌కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యల’’పై ఆందోళన వెలిబుచ్చింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న మతపరమైన సంఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వంతో సాధారణ, స్థిరమైన సంప్రదింపులు జరుగుతున్నట్లు భారత్ వెల్లడించింది.

Read Also: Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?

‘‘హిందువులు, ఇతర మైనారిటలపై బెదిరింపులు, టార్గెటెడ్ అటాక్స్ గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశం నిలకడగా, బలంగా తన వైఖరిని లేవనెత్తింది. మా వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరిని రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ఉగ్రవాద వ్యాఖ్యలు, పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే సంఘటనలపై మేము ఆందోళన చెందుతున్నాము. ఈ పరిణామాలు మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేము’’ అని చెప్పింది.

శుక్రవారం విలేకరుల సమావేశంలో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో హిందువుల వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ హిందూనేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించింది. దీనిపై అక్కడి మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు.