NRI Spouses: ఇటీవల కాలంలో తల్లిదండ్రులకు వారి అమ్మాయిలను అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ఫారన్ కంట్రీల్లో ఉంటున్న అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కట్నం ఎంతైనా కానీ మాకు ఎన్ఆర్ఐ అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. ఇక అమ్మాయిలు కూడా తాము కూడా విదేశాల్లో సెటిల్ కావడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు, మరో వైపు ఇలా ఎన్ఆర్ఐల్లో కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత భారతీయ మహిళల్ని విడిచిపెడుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగాయి.
ఎన్ఆర్ఐలు పెళ్లి చేసుకున్న తర్వాత వారు తమ భార్యలను విడిచిపెడుతున్నారు. జనవరి 1, 2020 నుంచి అక్టోబర్ 31, 2023 మధ్య ఇలాంటి సంఘటనల్లో మొత్తం 5339 మంది ఫిర్యాదులు మంత్రిత్వశాఖకు అందాయి. సగటున రోజుకు నాలుగు ఫిర్యాదులు నమోదవుతుండగా.. 2015తో పోలిస్తే 2023లో ఎన్నారై భర్తలు, భార్యలను విడిచిపెట్టిన కేసులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023లో, జనవరి మరియు అక్టోబర్ 2023 మధ్య, స్వీకరించిన ఫిర్యాదుల సంఖ్య 1,187గా ఉంది. 2015 క్యాలెండర్ ఇయర్లో ఇలాంటి ఫిర్యాదులు 796 వచ్చాయి. 2022లో మాత్రం అత్యధికంగా 1669 కంప్లైంట్స్ నమోదయ్యాయి. 2015తో పోలిస్తే ఇది మూడింతలు.
పెండింగ్లో ఎన్ఆర్ఐ వివాహ నమోదు బిల్లు:
అయితే, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ఆర్ఐ వివాహ నమోదు బిల్లు పెండింగ్లో ఉంది. 2019లో అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, ప్రవాస భారతీయలు వివాహ రిజిస్ట్రేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఎన్నారైల మోసపూరిత వివాహాల్లో మహిళలు ఇరుక్కొవద్దనేది ఈ బిల్లు ఉద్దేశం. చాలా వరకు ఇలాంటి సంబంధాల్లో మా అమ్మాయి విదేశాలకు వెళ్తుందని తల్లిదండ్రులు చూస్తున్నారు, తప్పితే అబ్బాయి ఎలాంటి వాడనేదానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది ఎన్నారైలు మోసపూరితంగా వివాహాలు చేసుకుంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత భార్యలను ఇక్కడే ఉంచుతున్నారు.
పెండింగ్లో ఉన్న బిల్లు ప్రకారం.. వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లో భారతదేశం లేదా భారతదేశంలో వివాహం జరిగితే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కుటుంబ చట్టాల ప్రకారం విడిచిపెట్టిన భార్యకు హక్కులను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం వివాహాన్ని తప్పకుండా నమోదు చేసుకునేలా చట్టాన్ని తీసుకురావాలని, ఈ బిల్లు పేర్కొంటోంది. ఒక వేళ 30 రోజుల్లో వివాహాన్ని రిజస్ట్రేషన్ చేయని పక్షంలో ఎన్ఆర్ఐ పాస్పోర్టు, ప్రయాణ పత్రాలను స్వాధీనం చేసుకోవడం లేదా రద్దు చేయడానికి పాస్పోర్టు అథారిటీకి అధికారం ఇచ్చే పాస్పోర్టు చట్టం-1967కి సవరణలను బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎన్నారైలు ఇలా భార్యలను విడిచిపెడుతున్న ఫిర్యాదులు పెరుగుతున్న క్రమంలో మరోసారి ఈ బిల్లు చర్చనీయాంశంగా మారింది.
భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) విదేశాలలో విడిచిపెట్టబడిన లేదా వారి జీవిత భాగస్వాములచే వేధించబడిన బాధలో ఉన్న భారతీయ మహిళలకు చట్టపరమైన మరియు ఆర్థిక సహాయం అందించడానికి ఉపయోగించబడుతుంది. విదేశీ మంత్రిత్వ డేటా ప్రకారం..2020-22 మధ్య ఇలాంటి మహిళల కోసం రూ. 25 లక్షలు ఖర్చు చేశారు. దీంట్లో సగం ఒక్క అమెరికాలోనే ఖర్చు చేస్తే, రూ.13 లక్షలు మిగిలిన 8 దేశాల్లో ఖర్చు చేశారు. విదేశాల్లో కష్టాల్లో ఉన్న భారతీయ మహిళలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలుగా, ప్రభుత్వం వివిధ ఛానెల్లను అందించింది – MADAD పోర్టల్, కాల్స్, వాక్-ఇన్లు, ఇ-మెయిల్స్, WhatsApp, సోషల్ మీడియా మరియు 24×7 హెల్ప్లైన్లు ఉన్నాయి.