CoinDCX: దేశంలో భారీ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగింది. భారతదేశంలోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలలో ఒకటైన CoinDCX హ్యాక్‌కు గురైంది. ఏకంగా 44 మిలియన్ డాలర్లు( దాదాపుగా రూ. 368 కోట్లు) నష్టం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఈ హ్యాక్ జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంటర్నల్ ఆపరేషన్ అకౌంట్లలో ఒకదానిని టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ముంబైకి చెందిన ఈ క్రిప్టో ప్లాట్‌ఫామ్ వినియోగదారుల వ్యక్తిగత నిధులు సురక్షితంగా ఉన్నట్లు హామీ ఇచ్చింది.
CoinDCX ఒక ప్రకటనలో.. లిక్విడిటీ ఆపరేషన్ కోసం ఉపయోగించే ఖాతా మాత్రమే ప్రభావితమైందని, కస్టమర్ల వ్యక్తిగత ఆస్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా మాట్లాడుతూ.. ఇది ‘‘అధునాతన సర్వర్ ఉల్లంఘన’’ అని, దీని కారణంగా దెబ్బతిన్నట్లు వివరించారు. నష్టాన్ని పూర్తిగా కంపెనీ ట్రెజరీ నిల్వలు కవర్ చేస్తాయని, ఇవి జరిగిన నష్టాన్ని భరిస్తాయని అన్నారు. ఈ హ్యాకింగ్ దాడిని గుర్తించిన వెంటనే కంపెనీ Web3 ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను తాత్కాలికంగా నిలిపేసింది. అయితే, ఇది ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
Read Also: Ambati Rambabu: “చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబు దిట్ట”.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
ప్రధాన క్రిప్టో ఎక్స్ఛేంజ్లో రెగ్యులర్ ట్రేడింగ్, INR విత్ డ్రాలు ఎప్పుడూ నిలిపివేయబడలేదు, వినియోగదారులు ఎటువంటి సమస్యలు లేకుండా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఈ సైబర్ దాడిపై కంపెనీ అంతర్గత భద్రతా బృందం, ప్రస్తుతం గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ భాగస్వాములతో కలిసి సెక్యూరిటీ ఉల్లంఘనను పరిశోధిస్తోందని, దొంగిలించిన నిధులను గుర్తించడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
CoinDCX త్వరలో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎథికల్ హ్యాకర్లు సిస్టమ్‌లో ఏదైనా బలహీనతలను బయటపెడితే వారికి రివార్డు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో క్రిప్టో భద్రత చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో ఈ ఉల్లంఘన జరిగింది. ప్రభుత్వం త్వరలో తన మొదటి క్రిప్టో పాలసీ పత్రాన్ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ రంగానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది.