మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తీవ్రమవుతున్న నేపథ్యంలో, హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కంపెనీలపై ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో, ఆదివారం (మే 17) నాడు సీఎన్జీ (CNG) ధరలను కిలోకు రూపాయి చొప్పున మరోసారి పెంచారు. రెండు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు మే 15న, సీఎన్‌జీ ధరలను కేజీకి రూ. 2కి పెంచారు. ఢిల్లీలో సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 80.09 కాగా, నోయిడా, ఘజియాబాద్‌లలో సవరించిన ధర కిలోకు రూ. 88.70గా ఉంది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ 11 వారాల పాటు ఇంధన ధరలను యథాతథంగా ఉంచాయి. ఆర్థికభారం కావడంతో పెరిగిన ధరలలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాయి. ఏప్రిల్ 2022 నుండి ధరలు స్తంభించిపోయాయి, కానీ లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చి 2024లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 చొప్పున ఒకేసారి తగ్గింపు జరిగింది.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటడంతో, అనివార్యంగా పెరిగిన ధరల నుండి దేశీయ వినియోగదారులను కాపాడటానికి ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఏప్రిల్ 2022లో రోజువారీ ధరల సవరణను విరమించుకున్నాయి.
