ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయని, పెట్టుబడులు పెట్టేందుకు వనరులు లేకుండా చేస్తాయని హెచ్చరించారు. ఉచితాలు మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, దేశం స్వయం సమృద్ధి సాధించకుండా అడ్డుకుంటాయని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉచిత పథకాలు, ధరల పెరుగుదలపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలపై మండిపడ్డారు.. అయితే, ఉచితాలను ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఉచిత పథకాలను అమలు చేయడం ఇప్పుడు చర్చగా మారింది.. దీనిపై స్పందించిన ఆమ్‌ఆద్మీ పార్టీ “కేజ్రీవాల్ మోడల్”ను యోగి అనుసరిస్తున్నారని పేర్కొంది.
Read Also: Central Team: ఓ వైపు వరద.. మరోవైపు కేంద్ర బృందం..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను ప్రకటించిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.. ఉచితాలను ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి “కేజ్రీవాల్ మోడల్”ను అవలంభిస్తున్నారని చెప్పుకొచ్చింది.. అంతకుముందు రోజు, సీఎం ఆదిత్యనాథ్ హిందీలో ఒక ట్వీట్‌లో, “ఉత్తరప్రదేశ్‌లో అతి త్వరలో, 60 ఏళ్లు పైబడిన తల్లులు మరియు సోదరీమణులకు ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని పొందేలా ఏర్పాట్లు చేయబోతున్నాం” అని ప్రకటించారు. ఆదిత్యనాథ్ ట్వీట్‌పై స్పందిస్తూ, ఆప్ జాతీయ అధికార ప్రతినిధి మరియు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో, “బీహార్ తర్వాత, యూపీలో మోడీ జీపై తిరుగుబాటు కనిపిస్తోంది” అని అభిప్రాయపడ్డారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అతిషి కూడా ప్రధానిపై విరుచుకుపడ్డారు, “మోడీ ఉచితాలను వ్యతిరేకించారు మరియు యోగి ఉచితాలను ప్రతిపాదిస్తున్నారు” అని ఆమె ట్వీట్ చేశారు.
ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో తన పార్టీ నేతల వ్యాఖ్యలను రీట్వీట్ చేశారు, కానీ, ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, ప్రధాని మోడీ గత నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఉచితాలను అందించే “రేవాడి సంస్కృతి”కి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించినప్పటి నుండి ఆప్ ఉచితాలను సమర్థిస్తోంది. ఇది అభివృద్ధికి చాలా ప్రమాదకరం అని అన్నారు. అయితే, ప్రజలకు మంచి విద్య, వైద్య సేవలు, విద్యుత్, నీరు మరియు ఇతర సౌకర్యాలు అందించడం ఉచితం కాదని, ప్రభుత్వం బ్యాంకు రుణాలను మాఫీ చేయడమేనని వాదిస్తూ, కేజ్రీవాల్ మరియు ఆప్ నాయకులు ప్రధానమంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు..
మరోవైపు, ఆగస్టు 3న, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల వాగ్దానానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)కు పూర్తి మద్దతునిస్తూ, ఉచితాల పంపిణీ అనివార్యంగా “భవిష్యత్తు ఆర్థిక విపత్తు”కు దారితీస్తుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్ మరియు ఆర్బీఐతో సహా అన్ని వాటాదారులను ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఉచితాల గురించి ఆలోచించి, నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని పేర్కొంది.. అర్హులైన మరియు వెనుకబడిన ప్రజానీకానికి సామాజిక-ఆర్థిక సంక్షేమం కోసం పథకాలను “ఉచితాలు”గా వర్ణించలేం, ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎన్నికల సమయంలో ఉచితాలను వాగ్దానం చేస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, అర్హులైన మరియు వెనుకబడిన ప్రజల కోసం పథకాలను హ్యాండ్‌అవుట్‌లుగా పరిగణించలేమని ఆప్ పేర్కొంది. మొత్తంగా ఈ వ్యవహారంలో.. ప్రధాని మోడీ నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యతిరేకిస్తున్నారా? అనే కొత్త చర్చకు తెరలేపారు నెటిజన్లు. అయితే, రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కార్నర్ చేయడానికే మోడీ ఈ మధ్య తరచూ ఉచిత పథకాల ప్రస్తావన తీసుకువస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరోవైపు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు కదా? అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.