NTV Telugu Site icon

CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..

Yogi Adityanath

Yogi Adityanath

CM Yogi Adityanath: కాంగ్రెస్‌పై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించిందని ఆరోపించారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాపై మాట్లాడుతూ, ఇది బాబా సాహెబ్ అంబేద్కర్‌కి తీవ్ర అవమానం అని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా, విదేశీ డబ్బును వినియోగించారని అన్నారు. గతంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కూల్చడంపై జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యల్ని యోగి ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ డబ్బు ప్రమేయం ఉందని, ఇందులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాల్గొన్నాయని, వీరు ఆ డబ్బు ద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఇది దేశద్రోహానికి సమానం అని చెప్పారు.

Read Also: Hero Karizma XMR 250: స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న హీరో కరిజ్మా XMR 250

సోరోస్‌తో సంబంధం ఉన్న సంస్థలు భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని బీజేపీ తరుచుగా ఆరోపిస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌తో సహా ఈ సంస్థలు రూపొందించిన నివేదికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తుంది. సోరోస్ నిధులతో నడిచే ఏషియా పసిఫిక్ ఫౌండేషన్‌లో డెమోక్రటిక్ లీడర్స్ ఫోరంతో సోనియా గాంధీకి సంబంధలు ఉన్నాయని బీజేపీ గతంలో ఆరోపించింది. ఈ సంస్థకు ఆమె కో-చీఫ్‌గా పనిచేశారు.

ఇదిలా ఉంటే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌ని ‘‘దేశద్రోహి’’ అని విమర్శించి కామెడీ యాక్టర్ కునాల్ కమ్రాపై యోగి స్పందించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛని కొందరు వ్యక్తిగత దాడులకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కానీ దురదృష్టవశాత్తు, కొంతమంది ఈ స్వేచ్ఛను ఉపయోగించి దేశాన్ని ముక్కలు చేయడానికి, విభజనను విస్తృతం చేయడానికి తమ జన్మహక్కు అని భావిస్తున్నారు’’ అని యోగి అన్నారు. ప్రస్తుతం కునాల్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.