CM Ashok Gehlot Counter To BJP Comments On Rahul Gandhi Tshirt: భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. రూ. 41 వేలు విలువ చేసే టీషర్ట్ ధరించారంటూ బీజేపీ శ్రేణులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే! అందుకు కాంగ్రెస్ శ్రేణులు వెంటనే కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ప్రధాని మోడీ ధరించిన రూ. 10 లక్షల సూట్ సంగతేంటి? అంటూ ఎదురుదాడికి దిగారు. అలాగే.. రూ.1.5 లక్షల కళ్లజోడు ధరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ విమర్శల్ని తిప్పికొట్టారు.
భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓవర్వలేక బీజేపీ ఆందోళనకు గురవుతోందని, అందుకే తప్పుడు ఆరోపణలు దిగుతోందని మండిపడ్డారు. టీ షర్టుల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఫైరయ్యారు. బీజేపీ వాళ్లు తక్కువేం కాదని.. కేంద్రమంత్రి అమిత్ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. చివరికి బీజేపీ నేతలు ధరించే సన్‌గ్లాసెస్ ధర అక్షరాల రూ. 2.50 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి నేతలు, రాహుల్ గాంధీ టీషర్ట్ గురించి మాట్లాడుతున్నారని, వాళ్లకు భారత్ జోడో యాత్రతో వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు.
కాగా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర.. 12 రాష్ట్రాలను కలుపుతూ కశ్మీర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగనుంది. ‘ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే జుడ్ జాయే అప్నా వతన్’ నినాదంతో సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల్ని కలుస్తూ.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నామో వివరించడంతో పాటు వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు.