Site icon NTV Telugu

Arvind Kejriwal: బీజేపీలోనే ఉండి డబ్బులు తీసుకోండి.. ఆప్ కోసం పనిచేయండి

Arvind Kejriwal

Arvind Kejriwal

CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు బీజేపీలో ఉంటూనే ఆప్ కు సహకరించాలని కోరారు.

బీజేపీ కార్యకర్తలందరూ అక్కడే( బీజేపీలో)నే ఉండి ఆప్ కోసం పనిచేయమన్నారు. మీరు తెలివైన వారు.. ఆప్ కోసం లోపల నుంచే పనిచేయండి, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మా కోసం పని చేయండి అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మాకు డబ్బులు లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్ కోట్ లో మీడియాలో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Karimnagar mayor Ravinder singh : టీఆర్ఎస్ లోకి రీఎంట్రీ తర్వాత రవీందర్ సింగ్ కి కలిసొచ్చిందేంటి..?

గుజరాత్ లో అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మీ పిల్లలకు ఉచిత విద్యను అందించే మంచి పాఠశాలను నిర్మిస్తాము.. ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తామని.. కుటుంబంలో మహిళలకు రూ. 1000 అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గుజరాత్ ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరథియాపై ఇటీవల జరిగిన దాడి అంశాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. మేం భయపడటానికి కాంగ్రెస్ వాళ్లం కాదని.. మేము భయపడబోమని.. పరికివాళ్లం కాదని.. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన అన్నారు. గుజరాత్ లోని 6 కోట్ల మందికి ఇప్పుడు ఆప్ ప్రత్యామ్నాయంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు కీలకంగా మారాయి. గుజరాత్ లో బీజేపీని అడ్డుకుంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆధిపత్యానికి బ్రేక్ వేయొచ్చని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ భావిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ సీట్ల సంఖ్య, ఓట్ షేర్ పెంచుకోగలిగింది.

Exit mobile version