Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. మసీదులోని వాజుఖానాలో దొరికిన ‘‘శివలింగం’’గా చెప్పబడుతున్న ఆకారానికి కార్బన్ డేటింగ్ పై ఏప్రిల్ 15 లోగా స్పష్టత ఇవ్వాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ వల్ల శివలింగం దెబ్బతింటుదా..? అనేదానిపై ఏఎస్ఐ తన ప్రతిస్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కార్బన్ డేటింగ్ వల్ల మసీదు, అందులోని శివలింగం ఏ కాలానికి చెందినవనే వివరాలను తెలుసుకోవచ్చు.
Read Also: Ukraine: ఉక్రెయిన్ లో జపాన్ ప్రధాని కిషిడా ఆకస్మిక పర్యటన
ఎనిమిది నెలలు గడువు ఇచ్చినా ఏఎస్ఐ స్పందించకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది వారణాసి కోర్టు ఆదేశాలతో మసీదును వీడియోగ్రఫీ చేశారు. దీంట్లో శివలింగం కనిపించడంతో పాటు కొన్ని చోట్ల గోడలపై హిందూ దేవీదేవతా మూర్తుల గుర్తులు కనిపించాయని తేలింది. అయితే ముస్లిం పక్షం మాత్రం దొరికిన శివలింగం ఆకృతి ఫౌంటెన్ అని పేర్కొంటోంది. అయితే కార్బన్ డేటింగ్ ఆధారంగా శాస్త్రీయ నిర్ధారణ చేయాలని హిందూ పిటిషనర్లు వారణాసి కోర్టును కోరారు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించడంపై ఈ అంశాన్ని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏఎస్ఐ తరుపు న్యాయవాది తమ రెస్పాన్స్ తెలియజేయడానికి మరింత సమయం కావాలని కోరారు.