China’s Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడి మరోసారి జి జిన్ పింగ్ మూడోసారి బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు ఉన్న జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో సీనియర్ అధికారులు 200 మందితో కూడిన సెంట్రల్ కమిటీని, ఇదే విధంగా 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను, అత్యంత శక్తివంతమైన ఏడుగురు సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటిని ప్రకటించనున్నారు. ఆదివారం రోజున జిన్ పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబడతారని అంతా భావిస్తున్నారు.
Read Also: Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
ఇది చైనా అధ్యక్షుడిగా మూడోసారి కొనసాగడానికి జిన్ పింగ్ కు అనుమతి ఇస్తుంది. మార్చిలో ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఆదివారం ప్రారంభంమైన కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత సమావేశాల్లో జిన్ పింగ్ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశం సాధించిన విజయాలు, కోవిడ్ విధానం, విదేశీ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
తైవాన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని.. చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని అన్నారు. తైవాన్ వేర్పాటువాదాన్ని అణిచివేస్తామని జిన్ పింగ్ ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. హాంగ్ కాంగ్ పై మాట్లాడారు జిన్ పింగ్.