US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..

  • భారత్ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్న చైనా..
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు..
  • తన ఆర్థిక రంగాన్ని ఆయుధంగా మారుస్తున్న చైనా..
  • భారత్‌, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు పెరగాలి..
  • అమెరికా కాంగ్రెస్ కీలక నివేదిక..
Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్‌‌లో పాకిస్తాన్‌కు చైనా మద్దతుగా నిలిచిందని, ఇది భారత్ ఎదుగుదలను అడ్డుకునే వ్యూహంలో భాగమని అమెరికా కాంగ్రెస్ కీలక కమిషన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. సరిహద్దుల్లో ఒత్తిడి పెంచడం, పారిశ్రామిక రంగానికి అవసరమైన సరఫరాపై ఆంక్షలు విధించడం ద్వారా భారత్‌ను నియంత్రించేందుకు చైనా ప్రయత్నిస్తోందని రిపోర్ట్ వెల్లడించింది. చైనా వ్యూహాలను ఎదుర్కోవడానికి అమెరికా, భారత్ మధ్య నిఘా సమాచారం, సముద్ర భద్రత, తయారీ రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని ఈ కమిషన్ సూచించింది. ఈ నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు నేరుగా నివేదించే యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ విడుదల చేసింది.

చైనాను ఎదుర్కొనే సత్తా భారత్‌కే ఉంది..

అమెరికా కూటమి వ్యవస్థలో భాగం కాకపోయినా, ఆసియాలో పవర్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని కమిషన్ అభివర్ణించింది. చైనా తయారీ రంగానికి, సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ఛాన్స్ భారత్‌కు ఉందని చెప్పింది. చైనాతో దీర్ఘకాలిక పోటీలో ప్రభావం చేపే సామర్థ్యం అమెరికా కూటమి వ్యవస్థకు బయట ఉన్న అతికొద్ది శక్తుల్లో భారత్ ఉందని నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని చైనా కూడా అర్థం చేసుకుందని, అనేక రంగాల్లో భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు పనిచేస్తోందని చెప్పింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు మద్దతు..

2025 మేలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మూడు రోజుల సైనిక ఘర్షణను నివేదిక ప్రస్తావించింది. ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకుండా సంక్షోభ సమయంలో తన మిత్రదేశం పాకిస్తాన్‌కు చైనా సహకరించినట్లు నివేదిక వెల్లడించింది. పాకిస్తాన్‌తో చైనా చేసుకుంటున్న సైనిక భాగస్వామ్యం కారణంగా రెండు వైపుల నుంచి ముప్పును భారత్ ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.

ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా సాంకేతిక సహకారం అందించినట్లు చైనా తొలిసారిగా అంగీకరించింది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాంగ్ హెంగ్ అనే చైనా ఇంజినీర్.. ఘర్షణ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళానికి (PAF) సాంకేతిక సహాయం అందించిన బృందంలో తాను కూడా ఉన్నట్లు వెల్లడించారు. జే-10సీఈ యుద్ధ విమానం గురించి మాట్లాడుతూ.. ఆ విమానానికి సంబంధించిన పరికరాలు “వాటి పూర్తి యుద్ధ సామర్థ్యంతో పనిచేసేలా చూడటమే” తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

చైనా నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాకిస్తాన్‌కు తాము ఏ విధంగా బలాన్ని అందిచగలమో చూపించిందని, ఇది భారత్‌లో ఆందోళనను మరింత పెంచిందని అమెరికా కమిషన్ తెలిపింది. హిందూ మహాసముద్రంలో భారత్‌కు ఉన్న ప్రాధాన్యతను చైనా గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా చైనా తన సైనిక బలగాలను విస్తరిస్తోందని, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఉనికిని, నిఘా కార్యకలాపాలను పెంచుతోందని హెచ్చరించింది.

చైనా చేతిలో ఆర్థిక ఆయుధం..

చైనా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం ఆర్థిక రంగమే అని అమెరికా నివేదిక చెప్పింది. కీలక పారిశ్రామిక ముడి పదార్థాలు, టెక్నాలజీ, నైపుణ్యాలపై నియంత్రణను ఉపయోగించుకుంటూ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని, భారత్ పోటీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా అడ్డుకోవాలని బీజింగ్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. భారత్‌పై ఆర్థిక ఒత్తిడిని తీసుకురావడానికి చైనా కీలక ముడి పదర్థాలు, ఉత్పత్తుల ఎగుమతుల్ని పరిమితం చేసిందని, ఇంజనీర్లను వెనక్కి పిలిచిందని, భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ వేఘాన్ని తగ్గించేందుకు అవసరమైన పరికరాల సరఫరా నిలిపేసిందని నివేదిక పేర్కొంది.

చైనా వ్యూహాలకు భారత్ ప్రతివ్యూహం..

మరోవైపు, భద్రతా పరమైన ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకుంటూ.. భారత్ చైనా చర్యలకు ప్రతిస్పందిస్తోందని నివేదిక పేర్కొంది. బారత్ తన సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరిస్తోందని, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని, కీలకమైన రంగాల్లో చైనా ప్రమేయాన్ని పరిమితం చేస్తుందని చెప్పింది. అమెరికా, ఇతర దేశాలతో భాగస్వామ్యాన్ని విస్తరిస్తోందని కమిషన్ తెలిపింది. ఈ ప్రయాణం అంత సులభం కాదని, భారత పారిశ్రామిక రంగం ఇప్పటికీ పెద్ద ఎత్తున చైనా యంత్రాలు, విడిభాగాలపై గణనీయంగా ఆధారపడుతోందని పేర్కొంది. దేశీయ సరఫరా వ్యవస్థలను నిర్మించుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భారీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, సమయం అవసరమని అభిప్రాయపడింది. రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికత, సరఫరా వ్యవస్థలు, సముద్ర భద్రతా కార్యక్రమాల్లో భారత్‌తో మరింత సన్నిహత సంబంధాలను పెంచుకోవాలని అమెరికా కమిషన్ సూచించింది.