CJI BR Gavai: శ్రీ మహా విష్ణువుపై భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) బీఆర్ గవాయ్ వ్యాఖ్యల అనంతరం, సోమవారం సుప్రీంకోర్టులో ఆయనపై దాడి జరిగింది. ఓ న్యాయవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సీజేఐ గవాయ్ మంగళవారం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సీజేఐ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం- పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని విచారిస్తుండగా ఈ కామెంట్స్ వచ్చాయి.
‘‘ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏం రిపోర్ట్ అవుతుందో మాకు తెలియదు. మీ క్లయింట్ చాలా బాధపడుతాడు’’ అని ఓ న్యాయవాదితో సీజేఐ అన్నారు. న్యాయ అధికారుల సర్వీస్ పరిస్థితులు -జీతాలకు సంబంధించిన అంశాలపై ఆల్ ఇండియా జడ్జిస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ చేసిన ఈ వ్యాఖ్య వచ్చింది. ‘‘న్యాయమూర్తి వినోద్ చంద్రన్ ఏదో చెప్పాలని అనుకున్నాడు, కానీ తాను ఆ విషయాన్ని ప్రైవేట్ గా పంచుకోవాలని కోరారు. ఈ రోజుల్లో విషయాలు అతిగా ప్రస్తావించబడే అవకాశం ఉంది’’ అని సీజేఐ సోషల్ మీడియాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
Read Also: 2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..
వివాదం ఏంటి..?
మధ్యప్రదేశ్ ఖజురహో కాంప్లెక్స్‌లో విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ, సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ‘‘మీరు వెళ్లి దేవుడినే ఏమైనా చేయమని అడగండి, మీరు నిజమైన భక్తుడని అంటున్నారు, కాబట్టి ఇప్పుడే వెళ్లి ప్రార్థించండి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో సీజేఐ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
సోమవారం 71ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ కోర్టు గదిలో చీఫ్ జస్టిస్‌పై బూటు విసిరేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత పెద్దదైంది. పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్తుండగా ‘‘భారతదేశం సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు’’ అని కిషోర్ కామెంట్స్ చేశారు. అయితే, ప్రధాన న్యాయమూర్తి కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను అభియోగాలు మోపవద్దని కోరిన తర్వాత న్యాయవాదిని అరెస్ట్ చేయలేదు.