Site icon NTV Telugu

Chidambaram: అమెరికా ఆపింది లేదంటే పాక్‌తో యుద్ధం చేసే వాళ్లమే..

Chidambaram

Chidambaram

Chidambaram: 2008 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర ఉగ్రవాద ఘటన తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలని భావించిందని, అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాము ఆ పనిచేయలేదని చిదంబరం అన్నారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, చిదంబరం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని చెప్పడానికి ప్రపంచం మొత్తం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు.

“అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కొండోలీజా రైస్, నేను బాధ్యతలు స్వీకరించిన రెండు లేదా మూడు రోజుల్లో నన్ను, ప్రధానమంత్రిని కలవడానికి వచ్చారు. ‘దయచేసి స్పందించవద్దు’ అని చెప్పారు. ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని నేను చెప్పాను. ఏ అధికారిక రహస్యాన్ని వెల్లడించకుండా, మనం ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసులో అనిపించింది” అని చిదంబరం ఓ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ చెప్పారు. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రధానితో, ఇతర ముఖ్యమైన వ్యక్తులతో తాను చర్చించానని వెల్లడించారు.

Read Also: H-1B visa: H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు.. ఫిబ్రవరి నాటికి కొత్త వ్యవస్థ..

చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. చిదంబర్ వ్యాఖ్యలు చాలా ఆలస్యం, చాలా తక్కువ అని బీజేపీ విమర్శించింది. ముంబై దాడుల తర్వాత విదేశాల ఒత్తిడి వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ముంబై దాడుల తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి చిదంబరం మొదట్లో ఇష్టపడలేదని, పాకిస్తాన్ పై సైనిక చర్య తీసుకోవాలని కోరుకున్నా, వేరే వాళ్లు గెలిచారని ఆరోపించారు.

ముంబై దాడులు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు తర్వాత పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారని, అదనే సమయంలో హిందూ ఉగ్రవాదం అనే తప్పుడు కథనాన్ని తెర పైకి తెచ్చారని బీజేపీ చిదంబరం, కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ఉగ్రవాద దాడులు చేసిన అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌కు అత్యంత అనుకూల దేశం(ఎంఎఫ్ఎన్) హోదా కల్పించడాన్ని ఆయన తప్పుపట్టారు.

Exit mobile version