Site icon NTV Telugu

4 రోజులుగా నీళ్లలోనే చెన్నై.. తిండిలేక అవస్తలు..!

చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ మీటర్ల వర్సం పడింది. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెన్నై ఎయిర్‌ పోర్టును మూసివేశారు. భారీ వర్షాలకు తోడు, ఈదురుగాలులు కూడా ఉండటంతో రోడ్లపైన చెట్లు అడ్డంగా కూలిపోయాయి. దాదాపు ఐదొందల కాలనీల్లో వర్షపు నీరి నిలిచిపోయి ఉందని, 65000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి 2440 మందిని రిలీఫ్‌ క్యాంపులకు తరలించారు.

చెన్నై ఎగ్మూర్‌ రోడ్డు పూర్తిగా నీట మునిగిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇటు సిటీలోని 11 సబ్‌వేల్లో నీరు వచ్చి చేరడంతో దాన్ని తోడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 267 చోట్ల చెల్లు కూలిపోయాయని, 68 చోట్ల రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించామని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ చెబుతోంది. ఇక ఫుట్‌పాత్‌లపైన జీవించేవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. బస్సు షెల్టర్లలో కూడా నీరు వచ్చి చేరడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తంబరంలోని ప్రభుత్వాస్పత్రి నీట మునిగింది. కేకే నగర్‌లోని పెరిపెరల్‌ హాస్పత్రిలోకీ నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్స్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. టీపీ చత్రంలో వర్షాలకు సృహకోల్పోయిన ఓ వ్యక్తిని స్థానిక సీఐ రాజేశ్వరి తన భుజాలపైన ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. దీంతో రాజేశ్వరి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రెండు మూడు రోజులుగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు రాజేశ్వరి. రోడ్లకు అడ్డంగా పడున్న చెట్లను నరకడంతో పాటు, ఇళ్లలోకి నీరు చేసి, రెండు రోజులుగా ఫస్ట్‌ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నవారికి పాలు బిస్కెట్లు సరఫరా చేస్తున్నారు. ఇక, చెన్న ఐఐటీ గ్రౌండ్‌లోకి వచ్చిన నీటిలో అక్కడి విద్యార్థులు ఈత కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇక, వర్షాలు, వరదల నేపథ్యంలో.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం..

Exit mobile version