Chandigarh mayoral polls: చండీగఢ్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఇండియా కూటమికి అగ్ని పరీక్ష కాబోతోంది. చండీగఢ్‌లో మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం (జనవరి 18) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇండియా కూటమి, బీజేపీ పార్టీకి మధ్య ముఖాముఖి పోరుగా ఉండబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమిలో సభ్యుడిగా ఉన్న ఆప్, బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా కూటమి నేరుగా బీజేపీకి సవాల్ విసరడం ఇదే తొలిసారి.
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. మేయర్ స్థానానికి ఆప్ పోటీ చేస్తుండగా.. డిప్యూటీ, సీనియర్ డిప్యూటీ మేయర్ స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తోంది. 35 స్థానాలు ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్ సభ్యుడు పార్టీ మారిన తర్వాత బీజేపీకి 14 మంది సభ్యుల బలం ఉంది. ఆప్‌కి 13, కాంగ్రెస్‌కి ఏడుగురు, శిరోమణి అకాలీదళ్‌కి ఒక కౌన్సిలర్ ఉన్నారు.
మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ మనోజ్ సోంకర్, కుల్జీత్ సంధు, రాజిందర్ శర్మను నిలబెట్టింది. ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ టిటా మేయర్ స్థానానికి పోటీపడగా, కాంగ్రెస్ నామినీలు గురుప్రీత్ సింగ్ గాబీ, నిర్మలా దేవిలు సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ స్థానాలకు పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి బీజేపీని సవాల్ చేయడం ఇదే మొదటిసారని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఈ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సెట్ చేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయాన్ని సాధిస్తుందని చెప్పారు.
