NTV Telugu Site icon

Census: 2025 నుంచి జనాభా లెక్కల సేకరణ.. డీలిమిటేషన్‌పై కేంద్రం సిద్ధం..

Census

Census

Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.

వచ్చే ఏడాది జనాభా గణనలో మతం, సామాజిక తరగతుల వారిగా సాధారణ వర్గకరణతో పాటు జనరల్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణన, జనరల్, ఎస్సీ-ఎస్టీ వర్గాల్లోని ఉప వర్గాల సర్వేలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, 2028 నాటికి ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Stock market: వరుస నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

జనాభా లెక్కల గురించి వివరాలు వెల్లడైన నేపథ్యంలో ప్రతిపక్షాలు కులగణపై చర్చను లేవనెత్తాయి. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ల గణన, లోక్‌సభ డీలిమిటేషన్‌కు సంబంధించిన విషయాలను స్పష్టం చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ కేంద్రాన్ని కోరారు. జైరాం రమేష్ మాట్లాడుతూ.. రెండు కీలక విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందా..? కుటుంబ నియంత్రణలో అగ్రగామి ఉన్న రాష్ట్రాలపై లోక్‌సభ పునర్విభజన ప్రతికూలతగా మారుతుందా..? అని ప్రశ్నించారు. కుల గణనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ అన్నారు.

నిజానికి 2021లో జనాభా గణన ప్రారంభించాల్సి ఉన్నా, కోవిడ్ పాండిమిక్ వల్ల వాయిదా పడింది. నాలుగేళ్లు ఆలస్యంగా కుల గణన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ యొక్క సెంట్రల్ డిప్యుటేషన్ ఇటీవల ఆగస్టు 2026 వరకు పొడిగించబడింది. దీంతో జనాభా గణన త్వరలో ప్రారంభమవుతుందని కేంద్రం మెసేజ్ ఇచ్చినట్లు అయింది. గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 121 కోట్లకు పైగా జనాభా నమోదైంది, ఇది 17.7 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది.