Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?

  • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం
  • కొత్త కార్యదర్శి నరేశ్ పాల్ గంగ్వార్
Naresh Pal Gangwar

Naresh Pal Gangwar

Naresh Pal Gangwar Higher Education Secretary: NEET-UG పరీక్షలో అక్రమాల ఆరోపణలు, పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎవరు నరేశ్ పాల్ గంగ్వార్?

నరేశ్ పాల్ గంగ్వార్ 1994 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ IAS అధికారి. ఆయన ఇప్పటివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గతంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన గంగ్వార్, కేంద్రంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.

వినీత్ జోషికి కొత్త బాధ్యతలు

1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్ కేడర్ IAS అధికారి వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు.

NEET వివాదం ఎలా మొదలైంది?

NEET-UG పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) జూన్ 20 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని CJP ప్రధాన డిమాండ్‌గా పెట్టుకుంది.

సోనం వాంగ్‌చుక్ దీక్షతో మరింత ఊపందుకున్న ఉద్యమం

జూన్ 28న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఈ నిరసనలో పాల్గొని నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. జూలై 20న CJP ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి పిలుపునివ్వగా, నిరసనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చర్చలకు సిద్ధమని కేంద్రం

ఈ పరిణామాల అనంతరం కేంద్ర ప్రభుత్వం పలుమార్లు CJP ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. అయితే, కేంద్ర మంత్రులే జంతర్ మంతర్ లేదా నిరసన ప్రాంతానికి సమీపంలోని వేదికకు రావాలని CJP స్పష్టం చేసింది. NEET వివాదం, పేపర్ లీక్ కేసులు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటుండగా, రానున్న రోజుల్లో ఈ అంశంపై మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.